7tv focus : ఆరోగ్యంగా ఉండేందుకు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. రోజువారీ జీవితంలో పని ఒత్తిడి, ఆందోళన, అనవసర ఆలోచనలు మనపై ప్రభావం చూపుతుంటాయి. వీటిని తగ్గించుకుని మానసిక ప్రశాంతత పొందేందుకు జపాన్లో కొన్ని సులభమైన పద్ధతులను పాటిస్తుంటారు. అవేంటో చూద్దాం..
ఆలోచనలను గమనించండి
ఖాళీగా కాసేపు కూర్చుంటే చాలు.. రకరకాల ఆలోచనలు మనసులోకి వస్తుంటాయి. ఇవి మన ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఇలాంటి ఆలోచనలను నియంత్రించేందుకు జపాన్లో ‘జాజెన్’ అనే ధ్యాన పద్ధతిని పాటిస్తారు.ప్రశాంతమైన ప్రదేశంలో వెన్నెముక నిటారుగా ఉంచుకుని కూర్చోవాలి. చేతులను ముందుకు ఉంచుకోవాలి. కళ్లను పూర్తిగా మూసుకోకుండా సగం మూసి, సగం తెరిచి ఉంచాలి. ఇలా కూర్చున్నప్పుడు మనసులోకి ఎలాంటి ఆలోచనలు వచ్చినా వాటిని మంచివి, చెడ్డవి అని నిర్ణయించకుండా అలాగే గమనించాలి.అదే సమయంలో నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనసును వేధించే ఆలోచనలపై వెంటనే స్పందించకుండా ఉండే అలవాటు ఏర్పడుతుంది. క్రమంగా ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా మారడానికి ఇది సహాయపడుతుంది. రోజూ కొంత సమయం ఈ పద్ధతిని సాధన చేస్తే మానసిక ప్రశాంతతను పొందవచ్చని చెబుతున్నారు.
లోపాలను అంగీకరించండి!
ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. అయితే చాలామంది తమ లోపాల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతుంటారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది.అందుకే మనలోని లోపాలను కూడా జీవితంలో ఒక భాగంగా అంగీకరించాలని జపనీస్ సంస్కృతిలోని ‘కింట్సుగి’ భావన చెబుతుంది. జపాన్లో పగిలిపోయిన వస్తువులను పడేయకుండా వాటిని ప్రత్యేకమైన పద్ధతిలో అతికించి, పగుళ్లు కనిపించేలా మరింత అందంగా తయారు చేస్తారు. అంటే.. ఆ పగుళ్లను లోపంగా కాకుండా ఆ వస్తువును ప్రత్యేకంగా చూస్తారు.అదే విధంగా మనలోని లోపాలను కూడా అంగీకరించి, వాటిని మన ప్రత్యేకతగా భావించాలని ఈ భావన సూచిస్తుంది. ఇలా సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

