7tv focus : కరువు పరిస్థితుల్లో మంత్రులు హెలికాప్టర్లను ఉపయోగించడం దారుణమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. హెలికాప్టర్ పర్యటనల కోసం చేస్తున్న ఖర్చులను తగ్గించి ఆ మొత్తాన్ని పంట నష్టపోయిన రైతులకు పరిహారంగా అందించాలని సూచించారు. నాయకుల హెలికాప్టర్ పర్యటనలపై సోషల్ మీడియాలో రీల్స్ చేయడాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఖమ్మంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.10 లక్షల విలువైన పనుల ప్రారంభోత్సవాలకు సైతం హెలికాప్టర్లు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్ల నిర్వహణపై చూపుతున్న శ్రద్ధలో కొంతైనా రైతుల సమస్యలపై చూపించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ రైతులకు అన్యాయం జరుగుతోందని సండ్ర ఆరోపించారు. పెద్దవాగు ప్రాజెక్టు నిర్లక్ష్యంపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

