7tv focus : దేశంలో గడిచిన పదేళ్లుగా ఫాసిస్టుల గొంతు గట్టిగా వినిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీఅన్నారు. దేశ రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటులేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భారత్ సమిట్‌లో ఆయన ప్రసంగించారు. ఫాసిస్టులవల్ల వ్యవస్థలు ధ్వంసం అవుతున్నాయని మండిపడ్డారు.2014లో జరిగిన ఎన్నికల లాంటి ఎన్నికలను తాను గతంలో ఎప్పుడూ చూడలేదని రాహుల్‌గాంధీ అన్నారు. ఆ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశారని, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ధ్వంసమైందని వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో యూపీఏ కూటమి ఎక్కువ సీట్లు గెలిచిందని, ఆ తర్వాత మూడు నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన గుర్తుచేశారు.ఆ ఎన్నికల్లోనూ అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేవలం మూడు నెలల వ్యవధిలో 70 లక్షలకుపైగా ఓట్లను నమోదు చేశారని, అదనంగా చేర్చిన ఆ ఓట్లతోనే బీజేపీ గెలిచిందని విమర్శించారు. వ్యవస్థలు నాశనమవుతున్నా మనం ప్రజాస్వామ్యం అని గొప్పగా చెప్పుకొంటున్నామని, రాజకీయాలంటే గట్టిగా మాట్లాడటం, ఘాటైన విమర్శలు చేయడం కాదని మండిపడ్డారు. పన్నెండేళ్ల క్రితం కుబేరుల జాబితాలో 600వ స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు ఎక్కడున్నారని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు.

