7tv focus : బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా మారిన ఆక్వాన్.. బుధవారం ఉదయం 5.30 గంటల సమయానికి అక్వాన్ తుపాను దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు సుమారు 3 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పు దిశగా 580 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 610 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 610 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 730 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏపీ తీర ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
20న తీరం దాటే అవకాశం
అక్వాన్ తుపాను ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 20 మధ్యాహ్నం నెల్లూరు, విశాఖపట్నం మధ్య ఏపీ, యానాం తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ సమయంలో ఇది తీవ్ర తుపానుగానే కొనసాగుతుందని తెలిపింది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని హెచ్చరించింది. అయితే ఇది మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం లేదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

