గురుకులాల్లో మరోసారి ఆహార భద్రతపై ప్రశ్నలు
కలుషిత భోజనంతో 30 మంది విద్యార్థులు అస్వస్థత.. బాన్సువాడ ఆసుపత్రికి తరలింపు
కాగిన నూనె, నాసిరకం సరుకులే కారణమంటూ తల్లిదండ్రుల ఆగ్రహం
7టీవీ ఫోకస్, కామారెడ్డి, జూలై 7: పాఠశాలలు పునఃప్రారంభమైన కొద్ది రోజులకే గురుకుల విద్యార్థుల ఆరోగ్యం మరోసారి ప్రమాదంలో పడింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో వడ్డించిన భోజనం వికటించడంతో 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు ప్రారంభమవడంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వరుసగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నా ఆహార నాణ్యత, వంటశాలల నిర్వహణ, పర్యవేక్షణలో మార్పు కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగిన వంట నూనెను పదేపదే వినియోగించడం, నాసిరకం ఆహార పదార్థాలతో వంటలు చేయడమే ఈ ఘటనకు కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, గురుకులాల్లో ఆహార భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

