7tv focus : ‘నా భార్య ఇజ్జత్ తీస్తుంది.. బతకాలని లేదు’ అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి తల్లిదండ్రులకు పంపి అదృశ్యమయ్యాడు. ‘నాకు ఈ బతుకు బతకాలని లేదు.. మీరైనా సంతోషంగా ఉండండి’ అంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిన అతడు స్కూటీపై హైదరాబాద్ వైపు వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోవడం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం మోతీఘనపూర్ గ్రామంలో కలవరం రేపింది.మోతీఘనపూర్ గ్రామానికి చెందిన శివప్రసాద్ (23) తన భార్య తరచూ గొడవలు పడుతూ తనను కొడుతోందని, బూతులు తిడుతూ అవమానిస్తోందని వీడియోలో తెలిపాడు. పెద్ద మనుషుల ముందు కూడా తననే తప్పుగా చిత్రీకరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆడవారివైపే చట్టాలు ఉన్నాయనే ధైర్యంతో తనను ఇబ్బందులకు గురిచేస్తోందని, కొడుతూ, కొరుకుతూ వేధిస్తోందని పేర్కొన్నాడు.

