7tv focus : కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోడు వినిపించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈరోజు(శుక్రవారం) అక్బర్పేట భూంపల్లి మండలం సిద్దిపేట – రామాయంపేట హైవేపై రైతులకు సరిపడా కరెంట్ సరఫరా చేయడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రైతులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. ఓట్ల కోసం గ్రామాలలోకి వచ్చారని.. అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు వేసిన వేల ఎకరాల పంట ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టన్నా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కూడవెల్లి వాగులో తాము నింపిన నీళ్లు ఇంకా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 18 గంటల పాటు కరెంట్ ఇవ్వకుంటే ఇక్కడ ప్రారంభమైన నిరసన ఢిల్లీకి చేరుకుంటుందని హెచ్చరించారు. నీళ్లు, కరెంట్ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణను కూడా సాధించుకున్నామని గుర్తుచేశారు.

