7tv focus : ఓ శ్రామికుడు బరువైన సిమెంట్ ఇటుకలను మోస్తూ మెట్ల ద్వారా 21 అంతస్తులు ఎక్కుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. చెమటోడ్చుతూ ఆయన మెట్లు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ అందరినీ ఆలోచింపజేస్తున్న విషయం ఏంటంటే.. ఆ భవనానికి ఒకటి కాదు.. నాలుగు లిఫ్ట్‌లు ఉన్నాయి. అయినా ఆ శ్రామికుడు మెట్ల మార్గాన్నే ఆశ్రయించారు. ఎందుకంటే శ్రామికులను ఆ భవన యాజమాన్యం లిఫ్ట్‌లోకి అనుమతించటం లేదు. ఎన్ని అంతస్తులైనా సరే వర్కర్లు మెట్లు ఎక్కే వెళ్లాలి.సదరు శ్రామికుడికి సంబంధించిన వీడియోను ఇంటర్నెట్లో షేర్ చేసిన వ్యక్తి.. లిఫ్ట్‌లో ప్రవేశం లేకపోవడాన్ని ప్రశ్నించారు. ‘చూడండి భవనంలో నాలుగు లిఫ్ట్‌లున్నాయి. కానీ వర్కర్లకు ఒక్క దాంట్లోనూ ప్రవేశం లేదు. వారు నిర్మాణ సామగ్రిని కూడా మెట్ల నుంచే తీసుకువెళ్లాలి’ అంటూ ఆయన వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై ఆన్లైన్లో సీరియస్‌గా చర్చ సాగుతోంది. నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. శ్రామికులతో ఇలా వ్యవహరించటం బానిసత్వానికి ఏ మాత్రం తీసిపోదని కామెంట్లు చేస్తున్నారు. వర్కర్లకు కనీస సదుపాయాలు కల్పించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

