7tv focus : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ సోమవారం దగ్గు, ఛాతిలో నొప్పితో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో పూణేలోని రూబీ హాల్ క్లినిక్‌లో ఆయనను చేర్పించారు. తన తండ్రి శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని ఆయన కుమార్తె, ఎన్పీపీ(ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. ‘నాన్నకు దగ్గు రావడంతో పూణేలోని రూబీ హాల్ క్లినిక్‌లో చేర్పించాం. ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన ఆరోగ్య సూచనలు నిలకడగా ఉన్నాయి. మీ అందరి ఆందోళనకు ధన్యవాదాలు’ అని ఎక్స్ పోస్ట్‌లో ఆమె పేర్కొన్నారు.కాగా, ప్లూరిటిక్ చెస్ట్ పెయిన్ (శ్వాస తీసుకునేటప్పుడు తీవ్రమయ్యే ఛాతి నొప్పి) వల్ల ఆరోగ్య పరీక్షలు, వైద్య పర్యవేక్షణ కోసం శరద్ పవార్‌ను ఆసుపత్రిలో చేర్చినట్లు రూబీ హాల్ క్లినిక్ చీఫ్ కార్డియాలజిస్ట్, చైర్మన్ అయిన డాక్టర్ పర్వేజ్ కె. గ్రాంట్ తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా శరద్ పవార్‌ను వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వివరించారు.

