7టీవీ ఫోకస్, చింతలపూడి, జూన్ 30: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఎంతో అండగా నిలుస్తోందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో లింగపాలెం మండలానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. లింగపాలెం మండలం నరసన్నపాలెం గ్రామానికి చెందిన బొల్లా సుందరికి రూ.2,48,000, లింగపాలెం గ్రామానికి చెందిన కొండ లావణ్యకు రూ.30,028 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మండల ముఖ్య నాయకుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైద్య చికిత్సలు మరియు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప భరోసాగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

