7టీవీ ఫోకస్, నిజామాబాద్, జూన్ 29: ఒలింపిక్ క్రీడల స్ఫూర్తిగా నిలిచే క్రమశిక్షణ, ఐక్యత, శాంతి, ఆరోగ్యకర జీవన విధానాన్ని యువత అలవర్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 40వ ఒలింపిక్ డే రన్–2026 కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవడంతో పాటు రాష్ట్రానికి, దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఒలింపిక్ క్రీడలు పోటీలకే పరిమితం కాకుండా క్రమశిక్షణ, ఐక్యత, శాంతి, పరస్పర గౌరవం వంటి విలువలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. క్రీడలను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని అన్నారు. జిల్లా ఒలింపిక్ సంఘం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. అనంతరం ఒలింపిక్ డే రన్‌కు జెండా ఊపి ప్రారంభించిన ఆయన, క్రీడాకారులతో కలిసి కొంతదూరం పరుగెత్తి వారిని ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నరసయ్య, నగర మేయర్ ఉమారాణి, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆకుల లలిత, కేశ వేణు, చంద్రశేఖర్ గౌడ్, క్రీడాకారులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

