7tv focus : తెలంగాణ వేదికగా జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్- 2026లో పాల్గొనే క్రీడాకారులు, కోచ్‌లు, అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఈ యూత్స్ గేమ్స్ నిర్వహణ, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరిగే ఈ గేమ్స్‌కు దాదాపు 7 వేల మంది క్రీడాకారులు హాజరవుతారని వెల్లడించారు.క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.120 కోట్లు కేటాయించినట్లు తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు వివరించారు. ఇప్పటికే 11 స్టేడియాలు సిద్ధం చేశామని తెలిపారు. మరో 5 స్టేడియాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి క్రీడా వేదికకు అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారిని ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రతి క్రీడా వేదిక వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

