7tv focus : ఒకరి ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ ఇంటి యజమానికి రసగుల్లా అని చెప్పి నాటు బాంబు ఇచ్చాడు. చీకటిలో గమనించని అతడు దానిని నోట్లో పెట్టుకుని కొరికాడు. ఆ బాంబు పేలడంతో ఆ ఇంటి యజమాని మరణించాడు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 10న మంగళవారం రాత్రి సమయంలో పడారియా గ్రామంలోని రాజేంద్ర బరోటియా ఇంటికి రామ్ భగత్ బరోటియా అనే వ్యక్తి వచ్చాడు. వారిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు.కాగా, ఇంటి యజమాని అయిన రాజేంద్రకు, రామ్ భగత్ ఒక నాటు బాంబు ఇచ్చాడు. అది రసగుల్లా అని చెప్పి నమ్మించాడు. చీకటిగా ఉండటంతో రాజేంద్ర ఆ బాంబును గమనించలేదు. రసగుల్లాగా భావించి నోట్లో పెట్టుకుని కొరకగానే భారీ శబ్దంతో అది పేలింది. ఆ పేలుడు శబ్దానికి ఇంట్లో ఉన్న రాజేంద్ర భార్య సుశీల భయాందోళన చెందింది. తీవ్రంగా గాయపడిన భర్తను పొరుగువారి సహాయంతో ఆటోలో ఆసుపత్రికి తరలించింది. అయితే అతడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

