7tv focus : వైరల్ రీల్ కోసం కొందరు యువకులు ప్రయత్నించారు. ఒక వ్యక్తితో బలవంతంగా పెట్రోల్ తాగించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. భయాందోళన చెందిన ఆ యువకుడు కాలుతున్న దుస్తులు విప్పి అక్కడి నుంచి పరుగెత్తాడు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఇది జరిగింది. అక్టోబర్ 27న పని తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్న ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు నిలువరించారు. గర్ఫాలోని హల్టు ప్రాంతంలో ఉన్న చెరువు సమీపానికి అతడ్ని తీసుకెళ్లారు.కాగా, ఆట నెపంతో ఆ యువకుడి కళ్లకు గంతలు కట్టారు. అతడి తలపై హెల్మెట్ ఉంచారు. పలుమార్లు చెంపదెబ్బలు కొట్టారు. ఆ వ్యక్తి తన హెల్మెట్‌ను తీయగానే బలవంతంగా బాటిల్లో ఉన్న పెట్రోల్ తాగించడానికి వారు ప్రయత్నించారు. ప్రతిఘటించడంతో అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.మరోవైపు ఆ వ్యక్తి చొక్కాకు మంటలంటుకున్నాయి. భయాందోళన చెందిన అతడు కాలుతున్న దుస్తులు విప్పి అక్కడి నుంచి పరుగెత్తాడు. కాలిన గాయాలైన ఆ యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

