7tv focus : ‘వందేమాతరం’ గీతం పూర్తి రూపంలో ఆలపించడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో యోగాగురు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ గీతంలోని సాహిత్యం హిందూ దేవతలైన దుర్గ, లక్ష్మి వంటి వారిని పూజించడం గురించి కాదని, కేవలం ‘భారతమాత’ కు చేసే ఆరాధన అని ఆయన ఆదివారం స్పష్టంచేశారు. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రాందేవ్ మాట్లాడారు.తాము భారతమాతనే దుర్గగా, లక్ష్మిగా భావిస్తామని, ఆమే మా విశ్వాసం, మా జ్ఞానం, మా ఆలయమని, వందేమాతరంలో దేవతలను, ఆలయాలను చూసేవారు మన సంస్కృతికి దూరమైన వారని, భారతమాత ఆరాధనను దేవతలతో ముడిపెట్టి ఒక మతానికి వ్యతిరేకమని చెప్పడం మేధో దివాళాకోరుతనమని రాందేవ్ బాబా అన్నారు. విద్యార్థుల నిరసనల గురించి ప్రస్తావిస్తూ, చిన్న పిల్లలను నిరసనల్లోకి లాగడాన్ని తప్పుబట్టారు. ఐదు పదేళ్ల పిల్లలను కూడా పోలీస్ స్టేషన్లను ముట్టడించాలని, ఎస్పీలు, డీఎంలను ఘెరావ్ చేయాలని ప్రోత్సహిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు.

