7tv focus : ఆడపిల్లల భవిష్యత్తు, చదువు, వివాహం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పొదుపు పథకాల్లో ‘సుకన్య సమృద్ధి యోజన’ (SSY) ఒకటి. 10 ఏళ్ల వయసులోపు బాలికల పేరుతో తల్లిదండ్రులు ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఈ పథకం కింద వార్షికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తుండగా, పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పథకం కింద డిపాజిట్లు ఖాతా తెరిచిన నాటి నుంచి 15 సంవత్సరాల వరకు చేయవచ్చు కానీ, ఖాతా మాత్రం 21 ఏళ్లకు పరిపూర్ణంగా మెచ్యూర్ అవుతుంది.అయితే, ఒక బాలికకు 21 ఏళ్లు నిండేలోపు .. అంటే మెచ్యూరిటీ కాలానికి ముందే వివాహం నిశ్చయమైతే డబ్బులు తీసుకోవచ్చా అనే సందేహాం చాలా మంది ఖాతాదారులకు వస్తుంది. పెళ్లి కోసం అమ్మాయి ఖాతాను ముందుగానే మూసివేసే సదుపాయం నిబంధనల్లో ఉంది. ఈ వెసులుబాటును వినియోగించుకోవాలంటే ఆడబిడ్డ వయసు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అంతేకాకుండా వివాహానికి ఒక నెల ముందు లేదా వివాహం జరిగిన మూడు నెలల లోపు సంబంధిత దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం వయసు ధృవీకరణ పత్రం, వివాహ ఆహ్వాన పత్రిక లేదా ధృవీకరణ పత్రాన్ని అందించాలి. ఈ దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత, ఖాతాలో జమ అయిన మొత్తం బ్యాలెన్స్, దానికి సంబంధించిన వడ్డీని వెనక్కి తీసుకోవడానికి వీలవుతుంది.

