ఎర్రుపాలెం 7tv focus : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం, వాటిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని బీఆర్ఎస్ ఎర్రుపాలెం మండల నాయకులు అన్నారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించడం రాజకీయ బాధ్యత అన్నారు. సోమవారం ఎర్రుపాలెంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. ‘‘ఎవరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని, ఆరోపణలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు మరచిపోలేదన్నారు. 100 పడకల ఆస్పత్రి నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, రహదారుల అభివృద్ధి తదితర పనులు ఎవరి హయాంలో జరిగాయో ప్రజలకు తెలుసన్నారు. కమల్రాజుపై వ్యక్తిగత విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకోవాలన్నారు. ఆ హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

