ఆర్మూర్-మంచిర్యాల, జగిత్యాల-కరీంనగర్ నాలుగు వరుసల జాతీయ రహదారులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
మోదీకి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపిన కిషన్ రెడ్డి

7టీవీ ఫోకస్, న్యూఢిల్లీ, జూన్ 4:
తెలంగాణలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊతమిచ్చింది. రాష్ట్ర ఉత్తర జిల్లాల రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.7,597.16 కోట్ల వ్యయంతో 190.76 కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఏ ఈ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల (ఎన్‌హెచ్-63), జగిత్యాల-కరీంనగర్ (ఎన్‌హెచ్-563) మార్గాలను నాలుగు వరుసల రహదారులుగా అభివృద్ధి చేయనున్నారు.ఈ నిర్ణయాన్ని స్వాగతించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీకి, కేంద్ర క్యాబినెట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ప్రస్తుతం అంకాపూర్, కోరుట్ల, ధర్మపురి, గంగాధర తదితర ప్రాంతాల్లో ఉన్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. అత్యాధునిక సదుపాయాలతో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రహదారులను అభివృద్ధి చేయనున్నారు.ప్రాజెక్టు పూర్తయితే ఆర్మూర్-మంచిర్యాల మధ్య ప్రయాణ సమయం దాదాపు గంటన్నర, జగిత్యాల-కరీంనగర్ మధ్య సుమారు 45 నిమిషాలు తగ్గనుంది. అలాగే ఇంధన వినియోగం, వాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు కార్బన్ ఉద్గారాల నియంత్రణకు దోహదం కానుంది.పీఎం గతిశక్తి ప్రణాళికలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పారిశ్రామిక కేంద్రాలు, లాజిస్టిక్స్ హబ్‌లను అనుసంధానం చేయనుంది. నిర్మాణ దశలో సుమారు 77 లక్షల పనిదినాల ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు

