సీతారామ ప్రాజెక్టుతో జలకళ.. రైతు, మత్స్యకార, గిరిజన కుటుంబాలకు ఆశాకిరణం

7టీవీ ఫోకస్, టేకులపల్లి, జూన్ 14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని రోళ్ళపాడు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రకృతి రమణీయమైన రోళ్ళపాడు ద్వీపం భవిష్యత్తులో ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిష్ఠాత్మక సీతారామ ఎత్తిపోతల పథకం జలాలతో ఈ ప్రాంతం సరికొత్త జలకళను సంతరించుకుంటుండగా, పర్యాటకం, వ్యవసాయం, మత్స్యరంగ అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకోనున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో విస్తరించిన జలాశయం, దాని నడుమ ఆకుపచ్చని ద్వీపం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం పెద్దగా గుర్తింపు పొందని ఈ ప్రాంతం, సీతారామ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రాష్ట్ర స్థాయి పర్యాటక కేంద్రంగా ఎదిగే అవకాశముందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మౌలిక సదుపాయాలు కల్పిస్తే రోళ్ళపాడు ద్వీపం భద్రాద్రి జిల్లాలోనే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. రోళ్ళపాడు జలాశయం ఇప్పటికే మత్స్యకార కుటుంబాలకు జీవనాధారంగా మారింది. ఇక్కడ చేపల పెంపకం కార్యకలాపాలు కొనసాగుతుండగా, అనేక కుటుంబాలు వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు పూర్తిస్థాయిలో చేరితే నీటి నిల్వ సామర్థ్యం పెరిగి మత్స్య సంపద మరింత అభివృద్ధి చెందే అవకాశముంది. దీంతో స్థానిక మత్స్యకార సంఘాలతో పాటు గిరిజన కుటుంబాలకు మరింత ఉపాధి లభించి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడనుందని భావిస్తున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తయితే టేకులపల్లి మండల రైతాంగానికి కూడా గణనీయమైన ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం వర్షాధార సాగుపైనే ఆధారపడుతున్న అనేక గ్రామాలకు సాగునీరు అందుబాటులోకి రానుంది. దీంతో రైతులు ఏడాదికి రెండు పంటలు పండించే అవకాశం పొందడంతో పాటు భూగర్భ జలమట్టం కూడా పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు. బావులు, చెరువులు, చిన్న జలవనరులు నిండుకుండలా మారడంతో సాగునీటి సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశముంది. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. బోటింగ్ నిర్వహణ, పర్యాటక మార్గదర్శక సేవలు, ఆహార విక్రయ కేంద్రాలు, స్థానిక హస్తకళల ప్రదర్శన వంటి రంగాల్లో ఉద్యోగాలు సృష్టించబడే అవకాశం ఉంది. గిరిజన మహిళలు సేకరించే తేనె, అటవీ ఉత్పత్తులు, స్థానిక రైతులు పండించే కూరగాయలు, పండ్లను పర్యాటకులకు నేరుగా విక్రయించే అవకాశం కలగనుంది. దీంతో రైతులకు మధ్యవర్తుల ఇబ్బందులు తగ్గి మెరుగైన ధరలు లభించే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాంత అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరమని స్థానికులు పేర్కొంటున్నారు. రోళ్ళపాడుకు చేరుకునే అటవీ మార్గాన్ని బీటీ రహదారిగా అభివృద్ధి చేయడంతో పాటు సీతారామ కాలువల పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు. పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా వెదురు కాటేజీలు, వీక్షణ స్థలాలు, పరిమిత స్థాయిలో జలక్రీడా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే పర్యాటకులను మరింత ఆకర్షించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. రోళ్ళపాడు ద్వీపం అభివృద్ధి కేవలం ఒక పర్యాటక ప్రాజెక్టుగా కాకుండా గిరిజన కుటుంబాలు, రైతులు, మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేసే సమగ్ర అభివృద్ధి కార్యక్రమంగా మారాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని మిగిలిన పనులను త్వరగా పూర్తి చేస్తే ఈ ప్రాంతం భద్రాద్రి జిల్లాలో వ్యవసాయం, పర్యాటకం, మత్స్యరంగ అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. “అభివృద్ధి అంటే కేవలం కాంక్రీటు నిర్మాణాలు కాదు. ప్రకృతిని కాపాడుకుంటూనే ప్రజలకు ఉపాధి కల్పించడం నిజమైన అభివృద్ధి. రోళ్ళపాడులో ఆ సామర్థ్యం ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటే ఈ ప్రాంతం భద్రాద్రి జిల్లాకే గర్వకారణంగా నిలుస్తుంది. మా ప్రాంత సహజ సంపదను పరిరక్షిస్తూ అభివృద్ధి చేస్తే గిరిజన కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతాయి” అని రోళ్ళపాడు గ్రామానికి చెందిన చీమల రాము తెలిపారు.


