సారయ్య కుటుంబానికి బియ్యం పంపిణీ.. ధైర్యం చెప్పిన ఫౌండేషన్ సభ్యులు

7టీవీ ఫోకస్, ,కేసముద్రం, జూన్ 14: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సారయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోవడంతో భార్య అమల, కుమార్తె ప్రియ, తల్లి ఉప్పమ్మ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సామాజిక సేవకుడు చిలువేరు సమ్మిగౌడ్ వెంటనే స్పందించి తన ఫౌండేషన్ ద్వారా కుటుంబానికి తక్షణ సహాయాన్ని అందించారు.
సారయ్య మరణానంతరం అంత్యక్రియల నిర్వహణకే కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడటంతో గ్రామస్తులు, దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు సేకరించి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఈ విషయం సమ్మిగౌడ్ దృష్టికి చేరడంతో, ప్రస్తుతం ఇతర అత్యవసర పనుల నిమిత్తం అందుబాటులో లేకపోయినా బాధిత కుటుంబాన్ని మరవకుండా తన ఫౌండేషన్ సభ్యులను ప్రత్యేకంగా పంపించారు. సమ్మిగౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుటుంబానికి బియ్యం పంపిణీ చేసి అవసర సమయంలో అండగా నిలిచారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో వారు ఒంటరిగా లేరని, సమ్మిగౌడ్ ఫౌండేషన్ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. గ్రామస్తులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఎప్పుడూ స్పందించే సమ్మిగౌడ్, తాను ప్రత్యక్షంగా అందుబాటులో లేకపోయినా వెంటనే స్పందించి సహాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమ్మిగౌడ్ నిజమైన సామాజిక సేవకుడిగా గుర్తింపు పొందుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సునీత కుమార్, వార్డు సభ్యులు పలుస పద్మ వెంకన్న, తండా సంపత్, మంద ప్రవీణ్, మంద విక్రమ్, అడపా రమేష్, మంద సాయిబాబా, అంకిరెడ్డి రాంబాబు, నూకల లింగస్వామి, గద్దల హరీష్, కార్తీక్, దుర్గయ్య సురేష్, ప్రభాకర్, వెన్ను సురేందర్, పిట్టల సందీప్ తదితరులు పాల్గొన్నారు.


