నీటి నిల్వలు, ట్రాఫిక్ సమస్యలపై ముందస్తు చర్యలు తీసుకోవాలి: సీపీ రమేష్

7టీవీ ఫోకస్, హైదరాబాద్, ప్రతినిధి జూన్ 15: వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాలు, చెట్లు కూలిపోవడం వంటి అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జూమ్ సమీక్ష సమావేశంలో కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్ల వారీగా వాటర్ లాగింగ్ పాయింట్ల పరిస్థితిని ఆయన పరిశీలించారు. వర్షాల కారణంగా తరచుగా నీటి నిల్వలు ఏర్పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, భారీ వర్షాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సిబ్బందిని ముందస్తుగా అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం కొనసాగించాలని, భారీ వర్షాలు కురిసే సమయంలో లా అండ్ ఆర్డర్ ఎస్‌హెచ్‌వోలు అదనపు సిబ్బందిని మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి నీటి ప్రవాహ మార్గాలను గుర్తించి, నీరు వేగంగా వెళ్లేలా అవసరమైన చర్యలు చేపట్టి నీటి నిల్వలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. రోడ్లపై వాహనాలు నిలిచిపోవడం, ట్రాఫిక్ రద్దీ పెరగడం వంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు. అలాగే కొనసాగుతున్న రోడ్డు పనులు, పూర్తయిన పనుల స్థితిగతులపై కూడా సమీక్ష నిర్వహించారు. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద విధుల నిర్వహణకు సంబంధించి అధికారులకు స్పష్టమైన బాధ్యతలు కేటాయించాలని సూచించారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ విభాగాలు జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఇతర సంబంధిత శాఖలతో సమన్వయంగా పనిచేసి వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీపీ రమేష్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో శేరిలింగంపల్లి ట్రాఫిక్ అదనపు డీసీపీ హనుమంతరావు, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.


