వారం రోజుల్లో 32 మంది పట్టివేత.. 3,559 మందికి అవగాహన
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 20: మహిళలపై వేధింపులు, అసభ్య ప్రవర్తనను అరికట్టేందుకు సైబరాబాద్ షీ టీమ్స్ ముమ్మర చర్యలు కొనసాగిస్తున్నాయి. గత వారం రోజుల్లో నిర్వహించిన ప్రత్యేక డీకాయ్ ఆపరేషన్లలో బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర చర్యలకు పాల్పడుతున్న 32 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చర్యలు తీసుకున్నాయి. ఇదే కాలంలో మహిళల నుంచి వివిధ మార్గాల ద్వారా 16 ఫిర్యాదులు అందగా, వాటిపై విచారణ చేపట్టినట్లు సైబరాబాద్ మహిళా, శిశు భద్రత విభాగం డీసీపీ కె. సృజన తెలిపారు. జూన్ 12 నుంచి 19 వరకు షీ టీమ్స్ మొత్తం 133 డీకాయ్ ఆపరేషన్లు నిర్వహించాయి. ఇందులో 29 మందిపై పెట్టీ కేసులు నమోదు చేయగా, మిగిలిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. మహిళల భద్రతకు భంగం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ) మూడు పీటీఏ (PITA) కేసులను ఛేదించి ముగ్గురు బాధితులను రక్షించింది. ఈ కేసుల్లో ఆరుగురు నిందితులను అరెస్టు చేసింది. అలాగే జువైనైల్ జస్టిస్ చట్టం కింద నమోదైన మరో కేసులో నలుగురు బాలురను రక్షించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుంది. కుటుంబ కలహాల కారణంగా విడిపోయిన దంపతులను తిరిగి కలిపేందుకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు, సీడీఈడబ్ల్యూ కేంద్రాల ద్వారా ప్రత్యేక ప్రయత్నాలు చేపట్టి 29 కుటుంబాల్లో సయోధ్య కుదిర్చినట్లు అధికారులు వెల్లడించారు. అవగాహన కార్యక్రమాల్లో భాగంగా షీ టీమ్స్, ఏహెచ్‌టీయూ సిబ్బంది సైబరాబాద్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి 3,559 మందికి అవగాహన కల్పించారు. మహిళలపై వేధింపులు, సోషల్ మీడియా హరాస్మెంట్, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, స్టాకింగ్, సైబర్ బుల్లీయింగ్, సైబర్ మోసాలు, బాలల హక్కులు, భిక్షాటన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా మహిళల హెల్ప్‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, అత్యవసర సేవల నంబర్ 100, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 సేవల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించినట్లు డీసీపీ కె. సృజన తెలిపారు.

