7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 26: శాలిగౌరారం చెరువు నుంచి పంట పొలాలకు సాగునీటిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు శుక్రవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ నీటితో వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రైతాంగానికి సాగునీటి కొరత లేకుండా చూడాలనే లక్ష్యంతో శాలిగౌరారం చెరువు నుంచి పంట పొలాలకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు హాజరయ్యారు. ముందుగా చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, క్రస్ట్ గేట్ల ద్వారా అధికారికంగా సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాలిగౌరారం చెరువు కింద ఉన్న వేలాది ఎకరాల పంటలకు ఈ నీటి విడుదల ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చాడ కవిత సురేష్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.

