7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 27: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గాజులరామారం పరిధిలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. గాజులరామారం సర్కిల్ పరిధిలోని రోడ్ మేస్త్రి డివిజన్లో శనివారం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే పథకాలతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా పంపిణీ చేస్తున్న చీరలు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు చేరవేయడంలో కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు జాకీర్, బలరాం, సీహెచ్ బుచ్చిరెడ్డి, పద్మ, సలీం, రజాక్, దుర్గేష్, కల్పన, నరసింహ, ఆబేద్, లక్ష్మి, సుజాత, లావణ్యతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

