7టీవీ ఫోకస్, అమరావతి, జూన్ 27: అమరావతి రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించే వారి కుట్రలు ఇక సాగవని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాజధాని అంశంలో రైతులను మోసం చేసిన వారే ఇప్పుడు వారి పేరుతో రాజకీయాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని అంశంపై రాష్ట్ర ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించిన వైసీపీ నాయకులు ఇప్పుడు మళ్లీ రైతుల పేరుతో రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఐదేళ్లపాటు అమరావతి అభివృద్ధిని అడ్డుకుని, రాజధాని ప్రాంత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన వారే ఇప్పుడు రైతుల సంక్షేమం పేరుతో పర్యటనలు చేపట్టడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. అమరావతి రైతుల ఆగ్రహానికి కారణం వైసీపీ అనుసరించిన ద్వంద్వ వైఖరేనని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల నిరసనలను అణచివేసేందుకు అనేక చర్యలు తీసుకున్నారని, ఇప్పుడు అదే రైతుల పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించడం ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదన్నారు. అందుకే వైసీపీ నాయకులు ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందని వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొట్టడం, ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం, ఆ తర్వాత బాధితులమని ప్రచారం చేసుకోవడం వైసీపీ రాజకీయ శైలిగా మారిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. అలాంటి చౌకబారు రాజకీయాలను రాష్ట్ర ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అమరావతి పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసులపై దాడి జరగడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిపై దాడి చేయడం బాధ్యతారాహిత్య చర్య అని పేర్కొన్నారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడటం విచారకరమని, ప్రజాస్వామ్యంలో పోలీసులపై దాడులకు ఎలాంటి సమర్థన ఉండదని స్పష్టం చేశారు. అమరావతి రైతుల మనోభావాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, వారిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం మానుకోవాలని మంత్రి సూచించారు. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

