7టీవీ ఫోకస్, షామీర్పేట్, జూన్ 29: గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కృత్రిమ రంగులతో బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తూ, ఎలాంటి ట్రేడ్, ఫుడ్ లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న బేకరీపై ఎస్వోటీ కుత్బుల్లాపూర్ బృందం దాడులు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజీద్పూర్లో ఉన్న ఎంసీఆర్ బేకరీపై శనివారం ఎస్వోటీ కుత్బుల్లాపూర్ బృందం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా బేకరీలో ట్రేడ్, ఫుడ్ లైసెన్సులు లేకుండానే ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే గడువు ముగిసిన ఫ్లేవర్లు, కృత్రిమ రంగులను ఉపయోగించి బేకరీ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తయారీ ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటంతో పాటు ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. ఈ కేసులో బోడ ఆనంద్ (38), బోడ సౌజన్య (32)లను అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల కోసం జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. దాడుల్లో 13 కృత్రిమ రంగుల సీసాలు, ఒక లీటర్ గడువు ముగిసిన బటర్‌స్కాచ్ ఫ్లేవర్, 500 మిల్లీలీటర్ల చొప్పున మూడు గడువు ముగిసిన ఫ్లేవర్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

