7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 30: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఎస్ఐఆర్కు సంబంధించిన వాల్ పోస్టర్లను మంగళవారం నిజాంపేటలో సీపీఐ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఓటరు జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ప్రభుత్వం సమర్థవంతమైన ప్రచారం నిర్వహించడంలో విఫలమైందని విమర్శించారు. ఇంటింటికీ వెళ్లి బీఎల్వోలు దరఖాస్తు ఫారాలు అందజేస్తున్నప్పటికీ, కార్యక్రమం ఉద్దేశ్యం, విధానంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదన్నారు. అలాగే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తోందని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించి ప్రతి ఓటరికి పూర్తి సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నకంటి దస్తగిరి, నర్సమ్మ, అమృత, నాగమణి, ముత్యాలు, సత్తమ్మ, లక్ష్మి, అమృత తదితరులు పాల్గొన్నారు.

