7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూలై 2: తెలంగాణ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ గుంజ రేణుక నారాయణను వడ్డెర సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వడ్డెరల సంక్షేమం, రిజర్వేషన్ల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో వడ్డెర సంఘం నాయకులు తెలంగాణ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ గుంజ రేణుక నారాయణను తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం జేఏసీ అధ్యక్షులు పీట్ల మల్లేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం వడ్డెర సంఘం నాయకుడు పీట్ల కథాల్ నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా గుంజ రేణుక నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో తొలిసారిగా వడ్డెర కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, దానికి ఒక మహిళకు చైర్పర్సన్ బాధ్యతలు అప్పగించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి వడ్డెర సమాజంపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఈ బాధ్యతలను తనకు అప్పగించడం గర్వకారణమని పేర్కొన్నారు. వడ్డెరల సామాజిక, ఆర్థిక అభివృద్ధితో పాటు వారి సమస్యల పరిష్కారానికి కార్పొరేషన్ ద్వారా కృషి చేస్తామని తెలిపారు. వడ్డెరలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి మరింతగా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం నాయకులు ఆమెను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వడ్డెర జేఏసీ గౌరవ అధ్యక్షులు పీట్ల కథాల్, బివోఎస్ఎస్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ కొమ్మరాజుల శేఖర్, జనరల్ సెక్రటరీ శివరాత్రి వెంకటేష్, యువజన అధ్యక్షులు ఇరుగదిండ్ల రమేష్, సంఘం ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

