7 టీవీ ఫోకస్: 03-07-షాద్నగర్ ప్రధాన కూడలి విస్తరణ పనులను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టడంపై సామాజిక ఉద్యమ నాయకుడు చిన్నోళ్ల అనంతయ్య హర్షం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చేపడుతున్న ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, మున్సిపల్ చైర్మన్ బసప్ప, ఆర్డీఓ సరిత, తహసీల్దార్ నాగయ్య, ఏసీపీ లక్ష్మీనారాయణ, ఆర్ అండ్ బి అధికారులు, అలాగే ప్రధాన కూడలి విస్తరణ కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆర్.ఎన్. రాముకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ప్రధాన కూడలి విస్తరణతో ట్రాఫిక్ సమస్య తగ్గి విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, విస్తరణ పనుల నేపథ్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి తొలగించాల్సి వస్తే, అదే ప్రధాన కూడలి (సర్కిల్ సెంటర్)లో గౌరవప్రదంగా పునఃస్థాపించాలని అధికారులను కోరారు.అంబేద్కర్ విగ్రహ స్థాపన కోసం గతంలో ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు, కార్యకర్తలు ఎన్నో ఉద్యమాలు నిర్వహించాయని, తీవ్ర పోరాటాల అనంతరం ఆ విగ్రహం ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. అందువల్ల ప్రజల మనోభావాలను గౌరవిస్తూ విగ్రహాన్ని సర్కిల్ సెంటర్లోనే కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విగ్రహాన్ని వేరే ప్రాంతానికి తరలించే నిర్ణయం తీసుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలని చిన్నోళ్ల అనంతయ్య కోరారు

