ఏలూరు, జూలై 4 (7 టీవీ ఫోకస్): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, ఆర్థిక విధానాలు దేశ రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ఉపాధ్యక్షుడు టి. సాగర్ విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతులు, కార్మికులు, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా పోరాటాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఏలూరులోని డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో శనివారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలను టి. సాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశీ వాణిజ్య ఒప్పందాల పేరుతో అమెరికా, బ్రెజిల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి నూనెగింజలు, వంటనూనెలు, పత్తి, మొక్కజొన్న, పాల ఉత్పత్తుల దిగుమతులకు సుంకాలు తగ్గించడం వల్ల దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. వంటనూనెల దిగుమతులు పెరగడం వల్ల ఆయిల్‌పామ్, వేరుశెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. పత్తిపై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని పత్తి రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ పాల ఉత్పత్తుల దిగుమతులతో పాడి రైతులు, సహకార డెయిరీలు, లక్షలాది కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల ప్రభావంతో డీజిల్, ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు పెరిగి వ్యవసాయ వ్యయం భారీగా పెరిగిందని, రైతులపై అదనపు భారం పడుతోందన్నారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయకపోవడం అన్యాయమని విమర్శించారు. కేరళలో అమలవుతున్న రైతు రుణ విముక్తి చట్టం తరహా విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని, రైతులకు పూర్తి రుణమాఫీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ, గిట్టుబాటు ధరలు, వ్యవసాయ పెట్టుబడుల నియంత్రణ వంటి చర్యలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి మాట్లాడుతూ రైతు ఉద్యమాలకు ఏలూరు చారిత్రక కేంద్రంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ మహాసభలు రైతాంగ పోరాటాలకు కొత్త దిశానిర్దేశం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జాతీయ నాయకురాలు ఝాన్సీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డి. రమాదేవి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వి. నాగేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వై. కేశవరావు, నంబూరి రామరాజు, వంకినేని రంగారావు, బి. బలరాం, ఎం. హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మహాసభ ప్రారంభంలో రైతు సంఘం జెండాను రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై. కేశవరావు ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించడంతో పాటు, మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా స్మరించుకున్నారు.

