ఏకగ్రీవ ఎన్నిక.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తానన్న నూతన ప్రధాన కార్యదర్శి!!
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 5: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు నాయకుడు తన్నీరు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సంస్థాగత బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఫెడరేషన్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయనకు ఈ అత్యున్నత బాధ్యత అప్పగించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుత్బుల్లాపూర్‌కు చెందిన తన్నీరు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్‌లోని అంబర్‌పేట అలీ కేఫ్ చౌరస్తా సమీపంలోని పద్మావతి డీపీ రెడ్డి హాల్ (కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్)లో నిర్వహించిన ఫెడరేషన్ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టిడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కో-కన్వీనర్లు, మాజీ ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, వివిధ జిల్లాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్రవ్యాప్త పరిస్థితులు, సంస్థ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, జిల్లా కోర్టులు, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతి, సభ్యత్వ నమోదు కార్యక్రమం, జిల్లాల మహాసభల నిర్వహణ, అనంతరం రాష్ట్ర మహాసభల నిర్వహణ, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సంస్థలో విశేష సేవలు అందించిన తన్నీరు శ్రీనివాస్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన ఎన్నికను సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులంతా చప్పట్లతో ఆమోదిస్తూ అభినందనలు తెలిపారు.
జర్నలిస్టు ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు చెందిన తన్నీరు శ్రీనివాస్ జర్నలిస్టు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. టిడబ్ల్యూజేఎఫ్లో జిల్లా అధ్యక్షుడిగా, అనంతరం రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ సంస్థ విస్తరణ, సభ్యత్వ నమోదు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలులో విశేష కృషి చేశారు. జర్నలిస్టుల పట్ల ఆయన చూపిన అంకితభావం, సంస్థాగత నిబద్ధతకు గుర్తింపుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించినట్లు సమావేశంలో పలువురు నాయకులు పేర్కొన్నారు. సామాన్య జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన తన్నీరు శ్రీనివాస్.. కష్టపడి పనిచేస్తూ, విలువలతో కూడిన జర్నలిజాన్ని నమ్ముకొని అంచెలంచెలుగా ఎదిగారు. వార్తల్లో వాస్తవికత, నిష్పాక్షికత, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యత ఇస్తూ సహచర జర్నలిస్టుల విశ్వాసాన్ని సంపాదించారు. జర్నలిజం అనేది కేవలం వృత్తి మాత్రమే కాకుండా సమాజానికి జవాబుదారీతనం కలిగిన సేవ అనే భావనతో ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూ సహచరుల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అందరినీ కలుపుకొని వెళ్లే నాయకత్వం, సౌమ్య స్వభావం, అంకితభావమే ఆయనను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి చేర్చాయని పలువురు జర్నలిస్టు నాయకులు అభిప్రాయపడ్డారు.
జిల్లా శాఖల హర్షం…””
తన్నీరు శ్రీనివాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా శాఖలు, జర్నలిస్టు సంఘాల నాయకులు, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఆయన మరింత సమర్థవంతంగా పనిచేసి ఫెడరేషన్‌ను రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత బాధ్యతలు చేపట్టి జర్నలిస్టు ఉద్యమానికి విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు.

‘నమ్మకాన్ని నిలబెట్టుకుంటా’…
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా తన్నీరు శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్యతో పాటు రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, నేషనల్ కౌన్సిల్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ప్రతి జర్నలిస్టుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారం, ఫెడరేషన్ బలోపేతం కోసం మరింత చిత్తశుద్ధితో, నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఐక్యతే సంస్థకు బలం అని, ప్రతి సభ్యుడి సహకారంతో ఫెడరేషన్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

