కుత్బుల్లాపూర్, జూలై 8 (7 టీవీ ఫోకస్): దూలపల్లి–జీడిమెట్ల ఇండస్ట్రియల్ రోడ్డు అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చొరవతోనే మంజూరైందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను కాంగ్రెస్ నాయకులు తమ ఘనతగా చెప్పుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇటీవల దూలపల్లి–జీడిమెట్ల ఇండస్ట్రియల్ రోడ్డు వద్ద చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రత్యేక చొరవతో దూలపల్లి–జీడిమెట్ల ఇండస్ట్రియల్ రోడ్డు మంజూరైందన్నారు. ప్రతిపాదనల నుంచి పరిపాలనా అనుమతుల వరకు ఎమ్మెల్యే చేసిన కృషి వల్లే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులకు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కొబ్బరికాయలు కొట్టి తమ ఘనతగా చెప్పుకోవడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని విమర్శించారు. అభివృద్ధి పనులపై మాట్లాడే ముందు పూర్తి అవగాహనతో వ్యాఖ్యలు చేయాలని సూచించారు. ప్రజలు వరుసగా మూడు పర్యాయాలు కేపీ వివేకానంద్ను భారీ మెజారిటీతో గెలిపించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలబెట్టారని, అదే సమయంలో కూన శ్రీశైలం గౌడ్ వరుస ఎన్నికల్లో ప్రజల చేత తిరస్కరణకు గురయ్యారని పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా మాట్లాడడం సమంజసం కాదన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని సురేష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య, విద్యుత్ అంతరాయాలు, వీధి దీపాల నిర్వహణ, దోమల నివారణ చర్యల్లో నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షంపై ఆరోపణలు చేయడం ద్వారా కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. కుత్బుల్లాపూర్ ప్రజల విశ్వాసంతో నిలిచిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రజాదరణను ఎలాంటి విమర్శలు దెబ్బతీయలేవని సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు చింతల దేవేందర్, రవీందర్ యాదవ్, బూర్గుబావి సత్యనారాయణ, గంగయోల వెంకటేష్, డప్పు కిరణ్, పోలే శ్రీకాంత్, మహేష్, రాజు, రఘు, బాలాజీ, నరేష్, పెంటయ్య, సుదర్శన్, గుబ్బల లక్ష్మీనారాయణ, కోల శ్రీకాంత్ ముదిరాజ్, మహమ్మద్ ఇస్మాయిల్, దుర్గారావు, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.


