మిడ్జిల్, జూలై 8 (7 టీవీ ఫోకస్): మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ మిడ్జిల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని ఆమె తెలిపారు. మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ బుధవారం మిడ్జిల్ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మండల పరిధిలోని లింబియా తండా పంచాయతీలో గ్రామానికి కొత్త ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం రాణిపేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే మిడ్జిల్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినుల భద్రత, సౌకర్యాల దృష్ట్యా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ముఖ్యంగా తండా పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తామని, రాబోయే రోజుల్లో మిడ్జిల్ మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, బాల త్రిపురసుందరి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. రాజేశ్వర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి, మాజీ మండల అధ్యక్షుడు కావలి నరేందర్, మండల ప్రధాన కార్యదర్శి వాసుదేవ్, శేఖర్, మండల ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి, నగేష్, దళిత మోర్చా మండల అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు పట్నం జంగయ్య, దేవేందర్, నరేష్, మల్లేష్, విష్ణు నాయక్, అరవింద్, నవీన్, అరుణ్ కుమార్, సహజది బేగం, సతీష్, చంటి తదితరులు పాల్గొన్నారు.

