పత్తికొండ, ఆగస్టు 3 (7టీవీ ఫోకస్ ) 2025 మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ డిమాండ్ చేశారు.పత్తికొండ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఐదు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డీఎస్సీ అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, నియామక ప్రక్రియపై చర్చించారు.అనంతరం పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తే సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ప్రభుత్వం వెనుకడుగు వేస్తే యువతలో అనుమానాలు మరింత పెరుగుతాయని అన్నారు. డీఎస్సీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ఈ నెల 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు, 10వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పత్తికొండ, తుగ్గలి, మద్దికేర, వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

