శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ”
“ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలు అందజేసిన సూరారం సీఐ బాలరాజు”
మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూరారం సీఐ బాలరాజు, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మేడ్చల్ శాఖ మరియు
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ – కొంపల్లి వారి సౌజన్యంతో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సూరారం కాలనీలో భక్తులకు ఉచిత మట్టి గణపతుల వితరణ కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూరారం సీఐ బాలరాజు చేతుల మీదుగా భక్తులకు మట్టి విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ బాలరాజు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే ప్రతిష్టించి పూజించుకోవాలని, పండుగను శాంతి సామరస్యాలతో, భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. సమాజ హితం కోసం శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం చేపడుతున్న ఇలాంటి సేవా కార్యక్రమాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సంఘ అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ.. ఇప్పటికే చెరువులు, కుంటలు కాలుష్యంతో కలుషితమైపోతున్నాయని, వీటికి తోడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనాలతో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వలన జలాలు మరింత విషతుల్యమయ్యే ప్రమాదం ఉందని, అందుకే ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో గత కొన్నేళ్లుగా తమ సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గణేష్ నవరాత్రులు వినోదం కోసం కాకుండా భక్తి ప్రవృత్తులతో జరుపుకోవాలని ఆయన సూచించారు.ఇందులోభాగంగా సూరారం కాలనీ లోని వాసుదేవ ఆశ్రమం లో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం మహిళా సభ్యురాలు గీతాశ్రీధరాచార్యులు, రాచపూడి శ్రావణి ల చేతులమీదుగా భగవద్గీత అభ్యాసకులకు మట్టి విగ్రహాలను అండజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన సలహాదారు సర్వేపల్లి రమేష్ కుమార్, సంఘ సభ్యులు గడ్డం రాంబాబు, హరి రాఘవేంద్ర, కనపర్తి సాయిరామ్, గడ్డం గోవర్ధన్ రావు, రామకృష్ణ శర్మ, రాచపూడి ప్రభాకర్, కోడూరి జగదీష్, సుబ్బలక్ష్మి సంజీవరావు, దివాకర్, చందు, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది రాకేష్, జే ఎస్ ఆర్ అసోసియేషన్ గ్రూప్ సభ్యులు కిరణ్ సాయి, విశాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

