టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పోరాట పటిమ, గెలుపు విషయంలో రాజీ పడని వ్యక్తిత్వానికి సంబంధించి సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాండరర్స్ వేదికగా సౌతాఫ్రికా-భారత్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ ప్రదర్శించిన నాయకత్వ శైలీ గురించి తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో డుప్లెసిస్ గుర్తుచేసుకున్నాడు.
పాడ్‌కాస్ట్‌లో డుప్లెసిస్ మాట్లాడుతూ.. గతంలో భారత్-సౌతాఫ్రికా మధ్య వాండరర్స్ వేదికగా జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌లో పిచ్ అత్యంత ప్రమాదకరంగా మారిందని అన్నాడు. ఆ మ్యాచ్‌లో డీన్ ఎల్గర్‌కు హెల్మెట్‌పై బలమైన బంతి తగిలిందని, ఆ పిచ్ వేగం చూస్తుంటే ‘ఇక్కడ ఎవరో ఒకరు చనిపోయేలా ఉన్నారు’ అనిపించిందని డుప్లెసిస్ వెల్లడించాడు. బంతులు గొంతు భాగానికి, తలకు తగిలేంత ప్రమాదకరంగా పిచ్ మారిందని, అలాంటి సమయంలో కూడా విరాట్ కోహ్లీ తన జట్టు ఆటగాళ్లకు నిర్దేశించిన కఠిన వ్యూహం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచిందని డుప్లెసిస్ తెలిపాడు.
ఆ మ్యాచ్‌లో భారత్ కొంత ఆధిక్యంలో ఉంది.. మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే కసితో కోహ్లీ ఉన్నాడని డుప్లెసిస్ తెలిపాడు. పిచ్ పరిస్థితిని చూసి బ్యాటర్లు ఎవరూ కూడా శరీరానికి బంతి తగిలినప్పుడు నొప్పితో ఎలాంటి రియాక్షన్ ఇవ్వకూడదని కోహ్లీ ఆదేశించినట్లు అతడు వెల్లడించాడు. అలా కోహ్లీ చెప్పడానికి కారణం.. ప్రత్యర్థికి బలహీనతను చూపించరాదన్నదే ఉద్దేశమని తెలిపాడు. చేతికి, గ్లౌజులకు లేదా తలకు తగిలినప్పటికీ ఎలాంటి బాధను బయటపెట్టకుండా భారత ఆటగాళ్లు ఎంతో పట్టుదలతో క్రీజులో నిలబడ్డారని డుప్లెసిస్ ప్రశంసించాడు.
మైదానంలో కోహ్లీ ప్రదర్శించే ఈ అసాధారణ దూకుడు, పట్టుదల సహచర ఆటగాళ్లలోనూ అంతులేని పోరాట పటిమను నింపేవని డుప్లెసిస్ కొనియాడాడు. మాటల కంటే చేతలతోనే నాయకత్వం ఎలా వహించాలో కోహ్లీ తన కెప్టెన్సీ ద్వారా నిరూపించాడని అతడు పేర్కొన్నాడు. ధోనీ నుంచి పగ్గాలు చేపట్టిన తర్వాత టీమిండియా టెస్ట్ క్రికెట్లో అత్యంత విజయవంతమైన (40 విజయాలు) కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ విజయాల వెనుక ఉన్న అసలు రహస్యం ఈ దృఢ సంకల్పమేనని వాండరర్స్ టెస్ట్‌లో జరిగిన ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.

