రాష్ట్ర వ్యాప్తంగా అర్నబ్ హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అతి తీవ్రతుపాను ‘అర్నబ్’ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు. విపత్తు నిర్వహణకు సంబంధించిన శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు: ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ బృందాలు 24 గంటలూ అందుబాటులో ఉండాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలను అవసరమైనప్పుడు వెంటనే తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో స్వచ్ఛమైన తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్‌ఫ్రీ నంబర్లు 1070, 112ను సంప్రదించాలని సూచించారు.
నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలి: మంత్రి గొట్టిపాటి
ఆర్నబ్ తుపాను వేళ విద్యుత్ శాఖలో నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవి అధికారులను ఆదేశించారు. ఎక్కడ విద్యుత్ స్తంభాలు కూలిపోయినా యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చేపట్టేందుకు తగినన్ని స్తంభాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. తుపాను ప్రభావం లేని ప్రాంతాల నుంచి సిబ్బందిని ప్రభావిత ప్రాంతాలకు తరలించి అందుబాటులో ఉంచాలని సూచించారు. నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ విద్యుత్ వ్యవస్థకు జరిగే నష్టాన్ని వీలైనంత తగ్గించాలని ఆదేశించారు. శాఖాపరమైన నిర్లక్ష్యం కారణంగా ఎలాంటి నష్టం జరగడానికి వీల్లేదని, ఎక్కడా ప్రాణనష్టం సంభవించకుండా సిబ్బంది పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినా, అంతరాయం ఏర్పడినా ప్రజలకు ముందుగానే సమాచారం అందించాలని మంత్రి గొట్టిపాటి రవి ఆదేశించారు.
తుపాను వల్ల ఏదైనా సమస్య ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ ద్వారా అవకాశం కల్పించింది. మనమిత్ర నెంబర్ 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసెజ్ చేసి సేవల జాబితాలో అర్నబ్ సైక్లోన్ ఇష్యూస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రిపోర్ట్ ఇష్యూస్, కన్ఫర్మ్, రిజిస్ట్రేషన్ ఆప్షన్లను వరుసగా ఎంపిక చేసుకోవాలి. అక్కడ పేరు, జిల్లా, మండలం వివరాలతో పాటు సమస్యను నమోదు చేయాలి. సమస్యకు సంబంధించిన ఫొటోలు కూడా అప్లోడ్ చేయొచ్చు. .

