రాష్ట్రంపైకి అర్నబ్ తుపాను కొనసాగుతోంది. ఇది అతి తీవ్ర తుపానుగా మారింది. ఒక రోజంతా అలాగే కొనసాగనుండడంతో నష్టం భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో భారీ గాలులు వీస్తాయని, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అలానే 53 రైళ్లను దక్షిణ కోస్తా రైల్వే రద్దు చేసింది. అర్నబ్ తీరానికి దగ్గరయ్యే కొద్ది తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది అతి తీవ్ర తుపానుగా తీరం దాటనుండడంతో భారీ గాలుల ముప్పుతో పాటు తీర ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గంటకు 15 కి.మీ వేగంతో కదులుతున్న తుపాను సోమవారం రాత్రికి మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారింది. ఈరోజు (మంగళవారం) ఉదయానికి అదే ప్రాంతంలో అతి తీవ్ర తుపానుగా బలపడినట్లు వాతావరణశాఖ తెలిపింది. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి బాపట్ల-విశాఖ మధ్య యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఆ సమయంలో గాలుల వేగం 115 కి.మీ నుంచి 125 కి.మీ. వరకు ఉండొచ్చు. కొన్నిసార్లు గాలుల వేగం 140 కి.మీ. వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో సముద్రంలోని అలలు 1 నుంచి 1.5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయి. తూర్పుగోదావరి, కాకినాడ, యానాంలోని తీర సమీప ప్రాంతాలను అలలు ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అర్నబ్ అతి తీవ్ర తుపానుగా ఎక్కువ సమయం కొనసాగనుండటంతో భారీ నష్టం కలగొచ్చని అధికారులు చెప్తున్నారు. ఇది ఈ రోజు ఉదయం 11.30 నుంచి రేపు (బుధవారం) ఉదయం 11.30 గంటల వరకు ఉండనుంది. బుధవారం అర్ధరాత్రి 11.30 సమయంలో తుపానుగా బలహీనపడి 29వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా, 30వ తేదీ నాటికి అల్పపీడనంగా బలహీనపడనుంది. ఇది సోమవారం సాయంత్రానికి గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 490 కి.మీ., విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 540 కి.మీ., శ్రీ విజయపురానికి వాయవ్యంగా 650 కి.మీ., కాకినాడకు 620, మచిలీపట్నంకు 720, బాపట్లకు 790 కి.మీ. దూరంలో ఉంది.
ప్రస్తుత అంచనాల ప్రకారం యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉండగా దట్టమైన మేఘాల వల్ల దిశ మారే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది అత్యంత తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని కొన్ని వాతావరణ నమూనాలు హెచ్చరిస్తున్నాయి.

