7tv focus : బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీలో మద్యం విక్రయాలు జరపకూడదని, బెల్టుషాపులు నియంత్రించాలని సర్పంచ్ బానోత్ సరోజ, పాలకవర్గం ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలో బుధవారం తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, ఎస్ఐ మేడా ప్రసాద్, ఎక్సైజ్ ఎస్ఐ అల్లూరి సీతారామరాజు మాట్లాడుతూ.. మద్యం సేవించి యువత ఆరోగ్యాలను నాశనం చేసుకోవద్దని, మద్యపానం నియంత్రణకు, బెల్టుషాపుల నియంత్రణకు పంచాయతీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయం గొప్పదన్నారు. అలాగే గ్రామంలో నేరాలను నియంత్రించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సర్పంచ్, పాలకవర్గానికి సూచించారు. ఈ విషయంలో యువత, ప్రజలు సహకరించాలని, మద్యం విక్రయాల నియంత్రణతో పాటు బెల్టుషాపులు లేని పంచాయతీగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జీపీవో బుల్లారావు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

