7tv focus : మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రారంభంలో భారీ ధరలతో అందుబాటులోకి తీసుకొచ్చిన కామన్ ట్రావెల్ పాస్‌పై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నెలవారీ పాస్ ధర రూ.8,500గా నిర్ణయించడంపై సామాన్య ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ధరతో పాస్ తీసుకోవడం కంటే విడివిడిగా టికెట్లు కొనుక్కోవడమే మేలంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. దీంతో ధరలపై పునఃసమీక్షకు దిగిన ప్రభుత్వం తాజాగా భారీగా తగ్గింపులు ప్రకటించింది.అక్టోబర్ 2న హైదరాబాద్ మెట్రో, టీజీఎస్ఆర్టీసీ సంయుక్తంగా కామన్ ట్రావెల్ పాస్‌ను ప్రారంభించాయి. అప్పట్లో రోజువారీ పాస్ ధరను రూ.400గా, నెలవారీ పాస్ ధరను రూ.8,500గా నిర్ణయించారు. అయితే ఈ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని, ప్రయాణికులపై అదనపు భారం పడుతుందని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా నెలవారీ పాస్ ధరపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 12న ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ధరలను సమీక్షిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ధరలను భారీగా తగ్గించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గతంలో రూ.8,500గా ఉన్న నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను రూ.4,000కు కుదించారు. ఇందులో రూ.3,000 మెట్రో ప్రయాణానికి, రూ.1,000 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించారు. ఈ పాస్‌తో నెలలో గరిష్ఠంగా 50 రౌండ్ ట్రిప్పులకు అనుమతి ఉంటుంది. ధర తగ్గింపుతో ప్రయాణికులకు నెలకు రూ.4,500 ఆదా కానుంది.
రోజువారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను కూడా రూ.400 నుంచి రూ.275కు తగ్గించారు. ఇందులో రూ.200 మెట్రో ప్రయాణానికి, రూ.75 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించారు. ఈ పాస్‌తో రోజుకు నాలుగు సింగిల్ జర్నీలు చేసుకోవచ్చు. దీంతో రోజువారీ పాస్ వినియోగదారులకు రూ.125 ఆదా కానుంది.

