7tv focus : బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దేవునిగుట్ట తండా లో ఎండిపోయిన వరి పంట పొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.మూసిసుందరికరణ, ఫ్యూచర్ సిటీ, ఫుట్ బాల్ సోకులకి డబ్బులు ఉంటాయి . కానీ రైతులకు ఇవ్వడానికి నిధులు లేవా? రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా అంటూ సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.రేవంత్ తెచ్చిన కరువని ఆరోపించారు. దేవాదులలో ఎన్ని గంటలు మోటార్లు నడిపారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ నీళ్లు విడిచిపెడితే చంద్రబాబు ఆ నీళ్లను వినియోగించుకున్నారని విమర్శించారు.రైతు భరోసా పడ్డట్టు ఫేక్ మెసేజులు పంపిన రేవంత్ రెడ్డి ఫేక్ మెసేజ్, ఫేక్ మాటలకు కేరాఫ్ గా మారారని దుయ్యబట్టారు. ఫేక్ మెసేజ్ లు పంపిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని కోరారు. సీఎం రేవంత్ కు ప్రజలు హాలిడే ఇచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జోస్యం చెప్పారు. కరువును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని, కరువు మండలాల ప్రకటనలో ఇష్టరాజ్యాంగా వ్యవహరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కరువు మండలాల ప్రకటన చేయలేదని విమర్శించారు.
రేవంత్ పాలనకు సున్నా మార్కులు
రేవంత్ పాలనకు సున్నా మార్కులు ఇవ్వొచ్చని అన్నారు.కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ వస్తే రేవంత్ వచ్చాక 12 గంటల కరెంట్ కూడా ఇవ్వలేదని వెల్లడించారు. మెదక్ జిల్లా అంటేనే సీఎం రేవంత్ కి చిన్న చూపని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సింగూరు ప్రాజెక్టులో తాగునీటి సమస్య ఏర్పడిందని,సంగారెడ్డి జిల్లాలో కేంద్ర సంస్థలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని, బీరు కంపెనీలకు మాత్రం దర్జాగా నీళ్లు ఇస్తున్నారని మండిపడ్డారు.

