7tv focus : హైదరాబాదీ బాడీబిల్డిర్ కే వెంకటేశన్.. ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన మిస్టర్ నేచురల్ వరల్డ్ బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచాడు. శాఖాహారి అయిన వెంకటేశన్.. స్వర్ణ పతకం గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ టుడేతో ఆయన మాట్లాడారు. గత ఏడాది కూడా స్వర్ణ పతకాన్ని గెలిచినట్లు ఈ సందర్భంగా 49 ఏళ్ల బాడీబిల్డర్ వెంకటేశన్ గుర్తు చేశారు. ప్రతి బాడీ బిల్డింగ్ పోటీ ఓ సవాల్ అని, ఇది కూడా అలాంటిదే అని, తాజా ఈవెంట్ చాలా ఎనర్జిటిక్‌గా జరిగిందని, కాంపిటీషన్లో ప్రతి ఒక్కరూ తీవ్ర పోటీ ఇచ్చారని వెంకటేశన్ తెలిపారు. జూబ్లీ హిల్స్‌లో ఉన్న వన్ ఫిట్నెస్ స్టూడియో కో-ఓనర్ మిస్టర్ కుమార్ మన్నావాకు వెంకటేశన్ కృతజ్ఞతలు తెలిపారు. నూరు శాతం శాఖాహార బాడీబిల్డర్ అని, ఆ దీక్ష, క్రమశిక్షణ, నిరంతర శ్రమను ప్రదర్శించడం వల్ల తన ఫిట్నెస్ సాధించినట్లు చెప్పారు.వృక్ష ఆధారిత జీవనశైలితోనూ మన ఫిట్నెస్ లక్ష్యాలను సాధించవచ్చు అని వెంకటేశన్ తెలిపారు. శాఖాహారిగా బాడీ బిల్డింగ్‌ను కొనసాగించడం చాలా కష్టమైన అంశమని, కానీ బాడీ బిల్డింగ్ కేవలం తన హాబీ మాత్రమే కాదు అని, అది నా ప్యాషన్, లైఫ్ స్టయిల్ అని వెంకటేశన్ తెలిపారు. డబ్బు కోసమో, పేరు కోసం ఈ పోటీల్లో పాల్గొనలేదని, బాడీ బిల్డింగ్‌ను ఇష్టపడుతానని, ఆ అనుభవం అమోఘమైందని, ప్రతి ఏడాది తనకు తానే ఛాలెంజ్ విసురుకుంటానన్నారు. కఠిన శ్రమ, సహనం, క్రమశిక్షణ, నమ్మకం వల్లే తాను పతకాన్ని గెలుచుకోగలిగినట్లు చెప్పారు.

