7tv focus : విగ్రహం ఊరేగింపు సందర్భంగా డీజే సిస్టమ్ ఏర్పాటు చేసిన వాహనం ఒక ఇంటి ముందు ఆగింది. అయితే డీజే శబ్దం హోరుకు ఆ ఇంట్లో ఉన్న నవజాత శిశువు గుండె ఆగింది. అచేతనమైన ఆ శిశువును ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 20 రోజుల కిందట ఆడ బిడ్డను ప్రసవించిన రీమా దేవి కాన్పు తర్వాత ముడియారి గ్రామంలోని పుట్టింటికి వచ్చింది. పది రోజులుగా నవజాత శిశువుతో కలిసి ఆ ఇంట్లో ఆమె ఉంటున్నది.కాగా, ఆ గ్రామంలో దేవతా విగ్రహం నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఒక వాహనంపై డీజే సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. రీమా దేవి ఉంటున్న ఇంటి వద్ద ఆ వాహనం ఆగింది. ఆ ఇంట్లోని తల్లి పక్కన నిద్రిస్తున్న 20 రోజుల నవజాత శిశువు, డీజే సౌండ్ హారుకు ఉలిక్కిపడి పెద్దగా ఏడ్చింది. గుండె ఆగిపోవడంతో కదలకుండా ఉండిపోయింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు ఆ నవజాత శిశువు మరణించినట్లు నిర్ధారించారు.

