7tv focus : కాంగ్రెస్ సర్కార్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉందో కళ్లకు కట్టినట్టుగా చూపించే దృశ్యాలు చాలా రోజులుగా తెరపైకి వస్తున్నాయని తెలిసిందే. ఎల్నినో ప్రభావం ఓ వైపుంటే.. మరోవైపు కరెంట్ కోతలు, సాగునీరు విడుదల చేయకపోవడంతో ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు నానా తిప్పలు పడుతున్నారు. కళ్ల ముందే చేతికొచ్చిన పంటను ఎండిపోతుంటే చేసేదేమి లేక అప్పులు చేసి భారీగా ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకర్లతో నీటిని పారబెట్టుకున్న వీడియోలు, కరెంట్ కోతల వల్లే జనరేటర్లు పెట్టుకున్న వీడియోలు ఇప్పటికే చాలా కనిపించాయి.ఇక పంట సాగు కోసం ఏకంగా చెరువులోని నీళ్లను వేలం వేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. రేవంత్ రెడ్డి సొంత జిల్లా, మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న నాగర్కర్నూల్ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం గమనార్హం.కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం మియాపూర్ గ్రామంలో నీళ్లు, కరెంటు లేక పంటలు ఎండిపోతుండడంతో రైతులు చెరువులు, కుంటలు, బావుల్లోని నీళ్లను వేలంపాట పాడారు. ఈ వేలంపాటలో 10 మంది రైతులు నల్లచెరువును రూ.2 లక్షలకు, ఊరుకుంటను రూ.1 లక్షకు, ఊరబావిని రూ.81 వేలకు దక్కించుకున్నారు. అయితే వేలంపాట పాడిన రైతులు ఇదే అదనుగా భావించి తాము దక్కించుకున్న నీళ్లను మోటార్లతో ఎత్తిపోయాలంటే రోజుకు రూ.7 వేలు చెల్లించాలని ఇతర రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.

