7tv focus : ఏపీలోని కడప జిల్లాలో గత అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయకు చెందిన టీడీపీ నాయకుడు పీపీ చెన్నరాయుడు ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి దహనం చేశారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి చెన్నరాయుడు తన వాహనంలో వేంపల్లె మండలంలోని గండిరోడ్డు మీదుగా వెళుతుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన కారును అడ్డగించారు. ఆ తర్వాత చెన్నరాయుడు చూస్తుండగానే కారుకు నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే డీఎస్పీ మురళీ నాయక్ నేతృత్వంలోని పోలీస్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అగ్నిమాపక సిబ్బందిని రప్పించి మంటలను అదుపుచేశారు.ఈ దాడి జరిగిన ప్రదేశంలో ఖాళీ బీరు సీసాలు, చెప్పులను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను, నాయకులను భయభ్రాంతులకు గురిచేసేందుకే ప్రత్యర్థులు కుట్రపూరితంగా ఈ దాడికి పాల్పడ్డారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే టీడీపీ పులివెందుల ఇన్చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించి, సర్పంచ్ అభ్యర్థిగా ఎస్ గౌస్ పేరును ప్రకటించారు.

