7tv focus : గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని ప్రస్తుత తరుణంలో కూలీలు వీబీ జీ రామ్ జీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ సీఈవో నాగలక్ష్మి అన్నారు. జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో ఉపాధి హామీ మేట్లకు ఏర్పాటు చేసిన రెండో రోజు శిక్షణా కార్యక్రమంలో శనివారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సూపర్ ఎల్ నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. అడుగంటుతున్న భూగర్భ జలాల దృష్ట్యా భవిష్యత్లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరూ నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల కలిగే నష్టాలను ముందుగానే నివారించేందుకు అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

నీటి సంరక్షణలో భాగంగా రైతులు తమ పొలాల్లో తప్పనిసరిగా పంట కుంటలు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న అంశాలను మేట్లు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ఉపాధి పనుల కల్పనలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, నిబంధనలకు లోబడి పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.

