ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు సాధారణంగా మారుతున్నాయి. అయితే వీటి ప్రభావం కేవలం మానసిక ఆరోగ్యంపైనే కాకుండా గుండె ఆరోగ్యంపైనా పడుతోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక ఒత్తిడి, అధిక కొవ్వులు, చక్కెరలు ఉన్న ఆహారం తీసుకోవడం వంటి కారణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బులు, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఒత్తిడిని నియంత్రించడంతోపాటు ఆహారపు అలవాట్లపైనా దృష్టి పెట్టడం అవసరం. ఒత్తిడి కొలెస్ట్రాల్‌ను నేరుగా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మనం ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు శరీరాన్ని సిద్ధం చేసే ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందనలో భాగంగా పనిచేస్తాయి. అయితే ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే ఈ హార్మోన్ల ప్రభావం శరీరంలోని జీవక్రియలపై పడుతుంది.రక్తనాళాల్లో పేరుకుపోయే కొవ్వు..
దీర్ఘకాలిక ఒత్తిడి సమయంలో కార్టిసాల్ స్థాయిలు పెరగడం వల్ల కాలేయం మరింత గ్లూకోజ్‌ను తయారు చేయడంతోపాటు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. ఇవి శరీరానికి కొన్ని ముఖ్యమైన ప్రక్రియల్లో అవసరమైనప్పటికీ, ఎక్కువ కాలం స్థాయిలు అధికంగా ఉంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి అడ్డంకులు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి శరీరంలో స్వల్పస్థాయి వాపును కూడా పెంచే అవకాశం ఉంటుంది. నిరంతరం ఒత్తిడికి గురైనప్పుడు హార్మోన్లు, నాడీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని మార్పులు ఇన్ఫ్లమేటరీ మార్కర్లను ప్రభావితం చేస్తాయి. ఇవి గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో సంబంధం కలిగి ఉంటాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతోపాటు శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులు రక్తప్రవాహంలోకి విడుదల కావడం కూడా పెరుగుతుంది. దీనివల్ల ట్రైగ్లిజరైడ్లు, మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల దీర్ఘకాలిక ఒత్తిడిని కేవలం మానసిక సమస్యగా కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసే అంశంగా చూడాల్సిన అవసరం ఉంది.
ఆహారపు అలవాట్లపైనా ఎఫెక్ట్..
ఒత్తిడి నేరుగా కొలెస్ట్రాల్‌పై ప్రభావం చూపడమే కాకుండా మన ఆహారపు అలవాట్లను కూడా మారుస్తుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆకలి, కడుపు నిండిన భావనను నియంత్రించే హార్మోన్లలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా కొందరిలో భావోద్వేగాలకు అనుగుణంగా ఎక్కువగా తినే అలవాటు ఏర్పడుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు తీపి, కొవ్వు అధికంగా ఉన్న ఆహారాలపై కోరిక పెరగడం సాధారణం. తక్షణంగా ఆకలి లేదా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, ఇతర అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలను ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆహారపు అలవాట్లు కొనసాగితే కొలెస్ట్రాల్ స్థాయిలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒత్తిడిని ఎదుర్కొనే క్రమంలో కొందరిలో మద్యం తీసుకోవడం కూడా పెరుగుతుంది. అధిక మద్యం వినియోగం ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను పెంచడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అదే విధంగా భోజన సమయాలు కూడా మారిపోతాయి. రాత్రివేళ ఆలస్యంగా ఎక్కువగా తినడం వల్ల అధిక కేలరీలు, సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్లు శరీరంలోకి చేరే అవకాశం ఉంటుంది.
ఒత్తిడి, ఆహారం రెండింటి పాత్ర..
కొలెస్ట్రాల్ పెరగడంలో ఒత్తిడి, ఆహారం రెండింటికీ పాత్ర ఉంటుంది. కేవలం ఒత్తిడిని తగ్గించడం లేదా కేవలం ఆహారాన్ని మార్చడం మాత్రమే సరిపోదు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఒత్తిడి నియంత్రణతోపాటు సమతుల్యమైన ఆహారం, శారీరక చురుకుదనం వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాలి. ఒత్తిడి కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేస్తుందని సూచించే కొన్ని సంకేతాల్లో తరచూ ఆందోళనగా అనిపించడం, రక్తపోటు, ఒత్తిడిలో ఎక్కువగా తినడం, నడుము చుట్టూ కొవ్వు పెరగడం, నిద్ర సరిగా లేకపోవడం, అలసట, సాధారణ ఆరోగ్య పరీక్షల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వంటివి ఉంటాయి. అయితే ఈ లక్షణాలు ఇతర కారణాల వల్ల కూడా వస్తాయని గుర్తుంచుకోవాలి. ఒత్తిడితోపాటు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. గుండెకు మేలు చేసే ఆహారాన్ని తీసుకోవడం, నిద్ర నాణ్యతను మెరుగుపరచడం, ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ వంటి పద్ధతులను పాటించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండడమే కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం ద్వారా అవసరమైన మార్పులు చేసుకోవచ్చు.

