కుత్బుల్లాపూర్, జూన్ 30 (7టీవీ ఫోకస్): గాజులరామారం సర్కిల్ పరిధిలోని మహాదేవపురం డివిజన్ (దేవేందర్ నగర్)లో అక్షర జ్యోతి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్-మల్కాజిగిరి డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే పలు సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. మహిళలు ఈ పథకాలను వినియోగించుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అక్షర జ్యోతి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎన్. పూలమ్మ, జ్యోతి, రామలక్ష్మి, స్థానిక కాంగ్రెస్ నాయకులు యం. సాగర్, దంపనబోయిన శ్రీనివాస్, శివప్ప, నరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, డాన్ శీను, ఋషి, శ్రీకాంత్ రెడ్డి, భాస్కర్, సాగర్, మహిళా సంఘాల సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

