వారిద్దరూ తల్లీకుమార్తెలు. నాలుగు నెలల క్రితం బంగాల్ నుంచి హైదరాబాద్ వచ్చారు. రైల్వే స్టేషన్లలో రద్దీని ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. చోరీ చేసిన సొత్తును ప్రముఖ ఆస్పత్రిలో బిల్లు కడుతున్నారు. ఇంతకీ ఎవరు వారు? ఎందుకు దొంగతనాలకు పాల్పడుతున్నారు? ఆస్పత్రిలో డబ్బును ఎందుకు కడుతున్నారు?
పశ్చిమ బెంగాల్‌కు చెందిన జమున భర్త తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతనికి మెరుగైన వైద్యం అందించేందుకు ఈ ఏడాది జులైలో కుమారుడు ఆనంద్, కుమార్తె మాలతితో కలిసి హైదరాబాద్‌కు వచ్చారు. గచ్చిబౌలి ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటూ ప్రముఖ ఆసుపత్రిలో తండ్రికి చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు ఖర్చులు పెరిగిపోవడం, ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో వారంతా డైలమాలో పడ్డారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లలో ప్రయాణికుల హడావిడిని ఆసరాగా చేసుకుని తల్లీకుమార్తెలు దొంగతనాలకు ఒడిగట్టారు.

