జూలై 20న సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన పార్లమెంట్ మార్చ్ చట్టవ్యతిరేకం అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ మార్చ్‌కు అనుమతి లేదని, అలాగే, అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారినందువల్లే బలప్రయోగం చేయాల్సి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు పోలీసులు తమ వాదన వినిపించారు. సీజేపీ ఆందోళన సందర్భంగా అక్కడి విద్యార్థులు, నిరసనకారులపై పోలీసులు, కేంద్ర బలగాలు లాఠీచార్జి చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో టియర్ గ్యాస్, పెల్లెట్స్ ప్రయోగం కూడా జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.దీంతో పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి ఢిల్లీ పోలీసులు బదులిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. సీజేపీ ఆందోళనకు అనుమతి లేదని, అది చట్టవ్యతిరేకం అన్నారు. ఈ అఫిడవిట్లో పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం.. సీజేపీ నిర్వహించిన పార్లమెంట్ మార్చ్‌కు జంతర్ మంతర్ వద్దకు 30,000 మంది వరకు వచ్చారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర వారంతా నిలిచి ఉన్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు 5,000 మంది పోలీసులు, భద్రతా సిబ్బంది ఉన్నారు. మొదట ఈ ర్యాలీ శాంతియుతంగా జరిగింది. ఆ తర్వాత కొందరు ఆందోళనకారులు బారికేడ్లు దాటుకుంటూ పార్లమెంట్ వైపు దూసుకొచ్చారు. దీంతో ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

